శ్రీమద్భగవద్గీత - 169: 04వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 169: Chap. 04, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 169 / Bhagavad-Gita - 169 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 07 🌴


07. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహం ||


🌷. తాత్పర్యం :

ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధినొందునో ఆ సమయమున నేను అవతరింతును.


🌻. భాష్యము :

ఇచ్చట “సృజామి” అను పదము ముఖ్యమైనది. దానినెన్నడును సృష్టింపబడు ననెడి భావనలో ఉపయోగించరాదు. ఏలయన గత శ్లోకము ననుసరించి భగవానుని దేహమునకు లేదా రూపమునకు సృష్టి యనునది లేదు. రూపములన్నియును నిత్యముగా నిలిచి యండుటయే అందులకు కారణమున. కావున సృజామి యనగా భగవానుడు తన స్వీయరూపముతో అవతరించునని భావము.

నియమానుసారముగా శ్రీకృష్ణుభగవానుడు బ్రహ్మదేవుని ఒక దినము నందలి ఏడవ మనువు యొక ఇరువది ఎనిమిదవ యుగపు ద్వాపర యుగాంతమున ఆవిర్భవించు చుండును. కాని అతనికి అదే విధముగా విధి నియమానుసారము అవతరింపవలెనను నిబంధనము మాత్రము లేదు. అతడు తనకు తోచినరీతిగా వర్తింపగలడు. కనుక అధర్మము ప్రబలి, నిజమైన ధర్మము అడుగంటినప్పుడు అతడు తన ఇచ్చానుసారము అవతరించు చుండును.

ధర్మనియమములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేదనియమాచరణము నందు భంగము వాటిల్లనిచో మనుజడు ఆధర్మవర్తనుడగును. ఆ నియమములు భగవానుని శాసనములని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. కేవలము శ్రీకృష్ణభగవానుడు మాత్రమే ధర్మవిధానమును సృజింపగలడు. వేదములు సైతము తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే పలుకబడినవి తెలియవచ్చుచున్నది. కనుకనే ధర్మనియమములు సాక్షాత్తుగా భగవానుని నిర్దేశములై యున్నవి (ధర్మం తు సాక్షాద్భగవత్ప్రణితమ్).

ఈ నియమములన్నియును భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినవి. భగవానుని అధ్యక్షతలో ఆ నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనమై యున్నది. ధర్మము యొక్క అత్యున్నత నియమము తననే శరణు వేడవలెననియు, అంతకు మించి వేరొకటి లేదనియు శ్రీకృష్ణభగవానుడు స్వయముగా గీత యొక్క అంత్యమున ప్రత్యక్షముగా ఆదేశించినాడు. ఆ దేవదేవుని సంపూర్ణ శరణాగతి లోనికే వేదనియమములు మనుజుని చేర్చగలవు. అట్టి నియమములు దానవులు మరియు దానవ ప్రవృత్తి గల వారిచే నశింపజేయ బడినప్పుడు శ్రీకృష్ణభగవానుడు అవతరించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 169 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 07 🌴


07. yadā yadā hi dharmasya glānir bhavati bhārata
abhyutthānam adharmasya tadātmānaṁ sṛjāmy aham


🌷 Translation :

Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata, and a predominant rise of irreligion – at that time I descend Myself.


🌷 Purport :

The word sṛjāmi is significant herein. Sṛjāmi cannot be used in the sense of creation, because, according to the previous verse, there is no creation of the Lord’s form or body, since all of the forms are eternally existent. Therefore, sṛjāmi means that the Lord manifests Himself as He is.

Although the Lord appears on schedule, namely at the end of the Dvāpara-yuga of the twenty-eighth millennium of the seventh Manu in one day of Brahmā, He has no obligation to adhere to such rules and regulations, because He is completely free to act in many ways at His will. He therefore appears by His own will whenever there is a predominance of irreligiosity and a disappearance of true religion.

Principles of religion are laid down in the Vedas, and any discrepancy in the matter of properly executing the rules of the Vedas makes one irreligious. In the Bhāgavatam it is stated that such principles are the laws of the Lord. Only the Lord can manufacture a system of religion. The Vedas are also accepted as originally spoken by the Lord Himself to Brahmā, from within his heart. Therefore, the principles of dharma, or religion, are the direct orders of the Supreme Personality of Godhead (dharmaṁ tu sākṣād bhagavat-praṇītam).

These principles are clearly indicated throughout the Bhagavad-gītā. The purpose of the Vedas is to establish such principles under the order of the Supreme Lord, and the Lord directly orders, at the end of the Gītā, that the highest principle of religion is to surrender unto Him only, and nothing more. The Vedic principles push one towards complete surrender unto Him; and whenever such principles are disturbed by the demoniac, the Lord appears.

🌹 🌹 🌹 🌹 🌹


17 Oct 2019