🌹1. మనోవిజయము - మనసు వ్యాకులము చెందకుండటయే స్థితిప్రజ్ఞత్వము 🌹

🌹1. మనోవిజయము - మనసు వ్యాకులము చెందకుండటయే స్థితిప్రజ్ఞత్వము 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 1 📚

భగవంతుని మొట్టమొదటి శాసనము కశ్మలమును వీడమని. ''కుతస్త్వా కశ్మలమ్‌ ఇదమ్‌'' అని శ్రీకృష్ణుని ప్రశ్నించుచు తన దివ్యోపదేశమును అందించినాడు. 

శ్రీభగవా నువాచ :
 *కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితమ్‌ |* 
 *అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున || 2* 

కశ్మలం అనగా మనో వ్యాకులత్వము. అది మోహముచే కలుగును. దాని వలన శోకమేర్పడును. పిరికితన మావరించును. 

మనస్సు మలినము చెందినదై సమస్తమును గజిబిజి చేయును. అనాచార్యము నాదరించుట జరుగును. స్వర్గము అనగా సువర్గము. అనగా వైభవము నుండి పద్రోయును. అపకీర్తిని కట్టబెట్టును. ఎట్టి విపత్కర పరిస్థితుల యందును మనసు వ్యాకులము చెందకుండటయే స్థితి ప్రజ్ఞత్వము. 

భాగవతుల జీవితమున దీనిని ప్రస్పుటముగ గమనించ వచ్చును. సులభముగ, త్వరితగతిని మనసు చెదరువారు బలహీనులు. వారిచే ఎట్టి ఘనకార్యములు నిర్వర్తింపబడవు.

''అనార్యము, నరకము, అపకీర్తి కట్టబెట్టు మనోవ్యాకులము నిన్నెట్లా వరించినది?'' అని భగవంతుడు అర్జునుని (నరుని అనగా మనలను) ప్రశ్నించుచున్నాడు. 

మనోవ్యాకులము నుండి విముక్తి చెందుటకు మార్గమును బోధించుచున్నాడు. కనుకనే భగవద్గీతకు మనో విజయమని కూడ పేరు కలదు.
🌹 🌹 🌹 🌹 🌹